మాటకోసం ఢిల్లీనే ఢీకొట్టారు. రాజకీయ అనుభవం లేకున్నా అనుభవజ్ఞులకు నిద్రలేకుండా చేశాడు.

467

తండ్రి మరణించిన నల్లకాలువ వద్ద భావోద్వేగంతో ఇచ్చిన మాట ఆ యువకుడి జీవితాన్నే మలుపు తిప్పింది. మాటకోసం ఢిల్లీనే ఢీకొట్టారు. రాజకీయ అనుభవం లేకున్నా అనుభవజ్ఞులకు నిద్రలేకుండా చేశాడు. ఇచ్చిన మాటకోసం చిరునవ్వుతోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఓదార్పు యాత్రతో మానవతావాదిగా కనిపించాడు. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించేశాడు. ఒకే ఒక్కడు ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పిన ధీరుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మే 30 ,2019 కొత్త శకానికి పునాది పడిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం అదే ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు.

ఎన్నో ఆశలతో కోట్ల ఓట్లు పోలయ్యాయి. రికార్డు స్థాయిలో సీట్లు దక్కాయి. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ సరిగ్గా ఏడాది క్రితం సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి ఇచ్చిన తొలి మాట ఆరునెలలులోగా మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా. నిజంగా జగన్ మంచి ముఖ్యమంత్రి అయ్యారా..? అయ్యారా అంటే దీనికి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే సంక్షేమంకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిపై అప్పుడప్పుడు స్పందిస్తూ మేనిఫెస్టోకే ప్రాధాన్యత ఇస్తూ న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తింటూ రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన మిస్టర్ కూల్‌గా ఉంటూ కళ్లముందే కాలం కరిగిపోయిందా అనే విధంగా ఏడాది గడిచిపోయింది. నేను విన్నాను.. నేను ఉన్నాను… అనే స్లోగన్‌తో నాడు వైసీపీ అధినేతగా వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. ఓవైపు రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో జగన్‌పై నిప్పులు చెరుగుతూ ప్రచారం చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం వైసీపీని చరిత్రలో ఎన్నడూ లేనంతగా అఖండ మెజార్టీతో గెలిపించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వానికి 23 సీట్లు మాత్రమే కట్టబెట్టారు.

ఇక పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలవగా… ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన రాపాక ఒక్కరే విజయం సాధించారు. ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేశాక తన తొలి ప్రాధాన్యత సంక్షేమమే అని చెప్పుకొచ్చారు.

ప్రచారంలో ఉండగా వైసీపీ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టిందో వాటికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రెండు పేజీలతో కూడిన నవరత్నాలను పూర్తి చేసి మళ్లీ 2024లో ఎన్నికలకు వెళతామని చెప్పారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్. సాధారణంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటేనే మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడం జరుగుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మేనిఫెస్టోలోని అంశాలపై దృష్టి సారించి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారు. హామీలు అమలు చేసేందుకు విపక్షాలైన టీడీపీ జనసేనలు ఆరునెలల సమయం ఇచ్చాయి. కానీ అంతకుముందే నవరత్నాల్లో ఏదైతే పొందు పర్చారో ఆ హామీలను నెరవేర్చారని స్వయంగా సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలుకు మాత్రం ఎక్కడా బ్రేక్ వేయలేదు. తేదీలు చెప్పి ఈ పథకాలను అమలు చేస్తుండటంపై ప్రతిపక్షాలే కాదు కేబినెట్ మంత్రులు కూడా షాక్‌కు గురవుతున్న పరిస్తితి నెలకొంది. అందుకే “చెప్పాడంటే.. చేస్తాడంతే” అనే ట్యాగ్‌లైన్‌ను తన కేబినెట్ మంత్రులు తనకు ఇచ్చారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *