గాల్వన్ వ్యాలీ తమదే- చైనా

600

గాల్వన్ వ్యాలీ తమదేనంటూ మొదట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. సోమవారం(జూన్ 16) రాత్రి భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత చైనా విదేశాంగ శాఖ కూడా గాల్వన్ వ్యాలీ తమదేనని అధికారిక ప్రకటన చేయడం భారత్‌తో సరిహద్దు వివాదాన్ని మరింత పెంచేదిగా మారింది. డైలీ బ్రీఫింగ్స్‌లో భాగంగా పీఎల్ఏ ఆఫీసర్ స్టేట్‌మెంట్‌ను,ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల సారాన్ని చైనా విదేశాంగ మంత్రి చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైనీస్ ఆఫీసర్ తన స్టేట్‌మెంట్‌లో గాల్వన్ వ్యాలీ తమదేనని పేర్కొనడాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చల్లో ఆ పాయింట్ ఎక్కడా లేదని మాత్రం చైనా పేర్కొనకపోవడం గమనార్హం.

చైనా ద్వంద్వ నీతి.. ఓవైపు భారత్‌తో వివాదాలను కోరుకోవట్లేదని చెబుతూనే… గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనిది చైనా గాల్వన్ వ్యాలీపై కన్నేయడం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ కంటే తామే శక్తివంతులమని నిరూపించుకోవడానికి తహతహలాడుతోంది. మరోవైపు భారత్ కూడా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మున్ముందు పరిస్థితులు యుద్ధ మేఘాలు సృష్టిస్తున్నాయి .

ఈ సందర్భంగా భారత్ చైనాకు రెండు విషయాలను గుర్తుచేసింది. ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలీఫోన్ సంభాషణలో.. సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్న ఒప్పందాన్ని గుర్తుచేసింది. అలాగే జూన్ 6న ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిబద్దతతో అమలుచేయాలని చెప్పింది. వీటిని విస్మరించి అతిశయోక్తితో కూడిన ఆమోదయోగ్యం కాని ప్రకటనలు చేయడం ఇరు దేశాల మధ్య అవగాహనకు విరుద్దమని స్పష్టం చేసింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత భారత్ ఈ ప్రకటన చేసింది.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *