పరమాచార్య ప్రశ్న – పవమాన ప్రతిష్ట

939
నేను 1979 నుండి 1982 మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసాను. మా కంపెనీకి కర్ణాటకలోని బెళ్గాం ఒక మార్కెటింగ్ డివిజన్. ఒక్కసారి నేను ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాను.
బెంగళూరు నుండి హుబ్లికి రైలు ఉదయమే చేరుకుంటుంది. కాని హుబ్లి నుండి బెళ్గాంకి వెళ్ళడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అది ప్యాసింజర్ రైలులాగా అన్ని స్టేషన్లలోను ఆగుతూ వెళ్తుంది. బెళ్గాంకి ఎవరైనా పైఅధికారులు వస్తే ఒక అధికారితో పాటు అసిస్టెంట్ మేనేజరు కూడా హుబ్లికి వచ్చి అక్కడి నుండి బెళ్గాంకి కారులో తీసుకువెళ్తారు.
ఆ మార్గంలో బ్రిటీషు వాళ్ళకి ఎదిరు నిలిచి పోరాడిన ధీరవనిత ‘రాణి చెన్నమ్మ’ పరిపాలించిన కిత్తూర్ అనే ఊరు వస్తుంది. కిత్తూర్ ఒక చిన్న పట్టణం. అప్పుడు మహాస్వామి వారు అక్కడే మకాం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడగానే మాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎక్కువమంది భక్తులు లేరు. ఒక పెద్ద చెట్టు కింద స్వామివారు కూర్చున్నారు. స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు. అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్ నేను స్వామివారికి సాష్టాంగం చెయ్యడానికి ఉపక్రమించాము. మమ్మల్ని వారిస్తున్నట్టుగా మహాస్వామివారు చెయ్యి చూపారు. అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజరు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు.
మాకు చాలా నిరాశ కలిగింది. కాని తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఆరోజు ఉదయం వరకు స్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారు. అప్పుడు కనుక మేము సాష్టాంగం చేసినట్లైతే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాచేస్తే వారి అరచేతి నుండి వెలువడే శక్తికి మేము తట్టుకోలేము కాబట్టి మహాస్వామి వారు వారించారు.
తరువాత స్వామివారు నా గురించిన విషయాలు అడుగుతూ, నా స్వస్థలం గురించి అడిగారు. అందుకు నేను తంజావూరు జిల్లాలోని అడుతురై అని చెప్పాను. నాకు అది ఎలా తెలుసు అని అడిగారు. అందుకు నేను చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని అని చెప్పాను. అలా అయితే అది మీ అమ్మగారి ఊరని, స్వస్థలమంటే అది నాన్నగారి ఊరిపేరు చెప్పాలని చెప్పారు. నా అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా కోరాను. నా స్వస్థలం గుర్తించడానికి వారు చాలా గుర్తులు చెప్పారు. కాని ఎందుకో పేరు మాత్రం చెప్పలేదు. ఆ ఊళ్ళో మా తాతగారు ఒక దేవాలయం నిర్మించారని, అందులో ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ట లేక ఆలయంలో ఉందన్న ఈ విషయం మాత్రం ఖండితంగా చెప్పారు.
నన్ను ఆ గ్రామాన్ని కనుగొని ఆలస్యం చెయ్యకుండా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చెయ్యవలసిందని ఆజ్ఞాపించారు. ఇదంతా జరిగిన తరువాత మాకు శ్రీకార్యం చెప్పారు ఎందుకు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దన్నారో. చాలా కొద్దిమంది మాత్రమే ఇంత దగ్గరగా స్వామివారితో మాట్లాడారని కూడా చెప్పారు.
ఆ తరువాత నేను కుంబకోణంలో ఉన్న మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. మా నాన్నగారి తోబుట్టువుల్లో ఉన్నది వారొక్కరే. వారికి అప్పటికే తొంబై ఏళ్ళు పైబడ్డాయి. ఆవిడ మాటల వల్ల, కుంబకోణానికి దక్షిణాన మన్నార్ గుడికి వెళ్ళెదారిలో నన్నిలం పక్కన ఉన్న కుదమురట్టి నదికి ఆనుకుని ఉన్న థిల్లాంబుర్ మా స్వస్థలం అని తెలిసింది.
వెంటనే నేను ఆ ఊరికి వెళ్ళి చూడగా పరమాచార్య స్వామివారు చెప్పినది నిజం. తరువాత ఆ గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి, భూస్వామి నరసింహాచార్య అందరమూ కలిసి స్వామి వారి ఆజ్ఞ ప్రకారం వైదికంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశాము. రెండు దశాబ్ధాలుగా గ్రామాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నాము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా ప్రఖ్యాతి గాంచింది. ఆరు శనివారాల పాటు పెళ్ళికాని అమ్మాయిల తల్లితండ్రులు ఇక్కడ పూజలుచేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది.
ఈ సంఘటన నా జీవితంలో చాలా అపూర్వమైనది. వారిని కలవడమే కాదు అటువంటి మహాపురుషులతో కలిసి మాట్లాడడం, వారిని దగ్గరగా సేవించుకోవడం, వారిచే ఆజ్ఞాపింపబడి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చెయ్యడం, ఇవన్నీ మరపురాని సంఘటనలు.
వారి కళ్ళల్లోకి మనం తీక్షణంగా చూడలేము. అంతటి శక్తి ఉన్నది ఆ కళ్ళల్లో. ఈనాటికి నేను కళ్ళుమూసుకుంటే ఆ సంఘటన సజీవంగా నా కళ్ళ ముందు కదలాడుతుంది.
— కె.ఎ. రాజగోపాల్, చెన్నై
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవంLeave a Reply

Your email address will not be published. Required fields are marked *