ధ్రువోపాఖ్యానం-భాగవతం

258

ధ్రువోపాఖ్యానం:భాగవతంలో ద్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటటు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు..ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజయిన ఉత్తాన పాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి వుంది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అపుడు సునీతి కొడుకయిన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అపుడు ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. “నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు”. కేవలం ఆభిజాత్యముతో ఈమాట అంటోంది. సురుచి మరల అంది “నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిన్దములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు.” అంది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వున్నది కాబట్టి ధ్రువుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు వుంటే నీ తండ్రి మనస్సును మరల అలా మార్చగలవాడెవడో తెలుసా! అది నీఅంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు’ అని చెప్పింది..అపుడు పిల్లవాడయిన ధ్రువుడు ‘అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చాడు. ‘నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు?’ అని అడిగాడు. ‘నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు ధ్రువుడు. అపుడు నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. అపుడు ధ్రువుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. ఏ పెద్ద పదవిని కోరతావు’ అని నారదుడు అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను. వెడుతున్నాను’ అన్నాడు.అపుడు నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొండుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి అంతంత కష్టాలు పడినవారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.అపుడు ధ్రువుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఏంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని శ్రీహరి కనపడతాడా, కనపడడా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే! నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి “నాయనా నీవు యమునానది ఒడ్డున నిరంతరమూ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టెయ్యి. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామి వారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు . . .✍️నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధృవుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా. ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మ్రుత్యు భయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా. ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలమునక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.అపుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తాన పాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తాన పాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాకించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది. తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలుట అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము . . .✍️ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు ధృవుడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధ్రువోపాఖ్యానం.కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు ‘అపుడు నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీవారము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో ఆ వరమును ద్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీల మేఘము వంటి శరీరము కలిగినవారి శంఖచక్రగదాపద్మములను పట్టుకుని తానూ అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. అపుడు వాళ్ళు “మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి’ అన్నారు.అపుడు ధ్రువుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితినా ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ వుంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరూ అని ఆలోచించాడు. ‘దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు మనసులో. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీత వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమయిన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది .
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *